haaram logo

Sunday, September 27, 2009

" ఇంక ఈ బ్లాగ్ ఆపివేస్తున్నాను" ....

రమణారెడ్డి గారికి,

నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలుపెట్టిన నా బ్లాగ్ ని దసరా శుభాకాంక్షలతో ఆపివేయదలచుకున్నాను....

నేను కొత్తగా బ్లాగ్ ఓపెన్ చేద్దామనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరిని రకరకాల పేర్లు సూచించమని అడిగాను. వాటిల్లో మయూఖ, మనస్వి అన్న పేర్లు నాకు చాలా నచ్హాయి. ముందు ఓపెన్ చేసిన బ్లాగ్ కి మయూఖ అని పేరు పెట్టాను. కంప్యుటర్ లో కూడా ఆక్సెప్ట్ అయ్యింది. తరువాత మనస్వి ఓపెన్ చేసుకొని నా కిస్టమైన పాటల కోసం పెట్టుకున్నాను. ఇది కూడా ఆక్సెప్ట్ అయ్యింది. ముందుగా మీ మయూఖ ఉన్న సంగతి నాకు తెలియదు. ఇందులో నేను మిమ్మల్ని చూసి కాపీ కొట్టిందేమి లేదు. ఇది అనుకోకుండా జరిగి పోయింది.

కాని తెలిసిన తరువాత మార్చటానికి నా మనస్వి తోటి ప్రయోగాలు మొదలు పెట్టాను. కాని మొత్తం బ్లాగ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మనస్వి లో ఏమి రావటం లేదు. కొత్త టెంప్లేట్ కూడా చూసుకున్నాను. నాకు నచ్హిన కొన్ని వేరే పేర్లతో బ్లాగ్ ఓపెన్ చేద్దామంటే అది రావటం లేదు. నెల రోజుల పైగా నేను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నా మయూఖ లో ఉన్నవన్ని కొత్త దానిలోకి ఉన్నవి ఉన్నట్లుగా మార్చుకోవాలని నా ప్రయత్నం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా నేను రాసుకున్నవి అన్ని కామెంట్స్ తో సహా వేరే బ్లాగ్ లోకి మార్చుకోవాలని నా ప్రయత్నం. కాని ఇవన్నీ చేయాలి అంటే చాల సమయం పట్టే టట్లుంది. నేనేమి కంప్యూటర్ ఎక్ష్పర్ట్ ని కాదు. నాకు ఒకరి సహాయం కావాలి. ఒకసారి మారుస్తున్నాను కాబట్టి ఇంక పర్ఫెక్ట్ గా ఉంచాలి అనుకున్నాను. ఇటువంటివే ఇంకా కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి.

రెండు బ్లోగుల పేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన పెద్ద ప్రమాదం ఉందని నేను అనుకోలేదు. బ్లోగ్ లో ప్రవేశించే వారికి ఇద్దరి పేర్లు వేరుగానే తెలుస్తాయి. మీరు రాసే విషయాలకి, నేను రాసే విషయాలకి చాలా తేడా ఉంది. వ్రాసే పద్ధతిలో కూడా చాల తేడా ఉంది. బ్లోగ్ లోకం గురించి నాకు అంతగా తెలియదు. ఇంతకంటే ఎక్కువ నేను ఆలోచించలేక పోయాను.

దొంగ పేర్ల తోటి వేరే బ్లోగర్స్ ని ఇబ్బంది పెట్టే అంత గొప్ప సంస్కారం కాదు నాది. నేను పెట్టుకున్న బ్లాగ్ పేరు మీకు అంత విపరీతంగా నష్టాన్ని కలిగిస్తుందని నాకు తెలియదు.

మీరు "కూడలి" ముఖంగా తెలియ చేసారు కాబట్టి నా నిర్ణయం కూడా బాధ్యతాయుతంగా "కూడలి" ముఖం గానేతెలియ చేయాలనుకున్నాను. ఇంక నా మూలంగా మీకు ఎటువంటి సమస్యా రాదు.

ఇంతవరకు నా బ్లాగ్ ని దర్శించి, తప్పులున్నప్పటికీ, అన్ని రకాలు గా ప్రోత్సహించిన బ్లాగ్ పెద్దలందరికి నా క్రుతజ్ఞతలు.

ధన్యవాదాలు.

Tuesday, September 22, 2009

ఇది ' తృష్ణ ' కి



జీవితమనే కాగితం

కలం కాగితాన్ని తాకినా, కక్షతో మాత్రం కాదు
కమనీయంగా మార్చాలని ప్రయత్నం మాత్రమే
పొలంలో హలం పరుగిడుతుంది, హరించి వేయాలని కాదు
హర్షణీయమైన ఫలితం ఆశించి మాత్రమే
అలాగే
నీ జీవితమనే కాగితాన్ని కమనీయంగా మార్చాలని కొందరు
నీ జీవితమనే పొలం లో, చెత్తమొక్కలు తీయాలని ఇంకొందరు
ప్రయత్నిస్తు ఉంటారు
వారిని మాత్రం పదిలంగా
నీ మదిలో దాచుకో మిత్రమా!

****************

ఒకప్పుడు నాకోసం రాసుకున్న ఈ 'నేను ' ఇప్పుడు 'నీ ' కోసం

నేను .....

ఓ అద్భుతాన్ని ....
ఓ ఆనందాన్ని - ఓ ఆశ్చర్యాన్ని
ఓ అనుభూతిని - ఓ అనుభవాన్ని
అంతులేని అలోచనను

ఆలోచనల అద్వైతానికి ఆక్రుతినిచ్హే ప్రక్రుతిని
విభాత సంజలో విరబూసిన చంద్రకాంత పుష్పాన్ని
ప్రభాత తుషారంలో తడిసిన తెల్లతెల్లని గులాబీని
శ్రావణ మేఘాల మధ్య మెరిసె ఒంటరి నక్షత్రాన్ని

కార్తీక పున్నమి నాటి వెన్నెల తాగి
చంద్రున్ని చూసి గర్వంగా నవ్వే చకోరన్ని
చలించే కాలాన్ని-జలపాతాల పరుగుల్లో
విద్యుల్లతలు మెరిపించే జ్వలిత జ్వాలను
నేను ...నేనే....నాకు ... నేనే!

పూర్వాపరాలతో నిమిత్తం లేని అపూర్వాన్ని
అసూర్యంపశ్యను నేను
విశ్వాంతరాళంలో నేనో పాలపుంతను
చరాచర జగత్తుకు వైతాళిక గీతం పాడే వేగుచుక్కను
ఈ చీకటి నా కంటి కాటుక కాదా!
ఈ వెన్నెల నామేని నిగారింపు కాదా!
మలయ మారుతం నా మంజుల గానం
పారిజాత పరిమళాల పాట పాడు నా నిశ్వాసం
నాకు నేనే సర్వస్వం ...... సమస్తం

*******************************

Friday, September 18, 2009

'వాణిశ్రీ-వీణా నాదం '

వాణిశ్రీ అంటేనే వీణ. నవరసాలను వీణలోనే పలికించింది. తానే 'వీణా వాణి ' అని నిరూపించింది. ఒకప్పుడు సినిమాల్లో పియానొ ఎక్కువ వాడే వాళ్ళు. కాని వాణిశ్రీ తోటి వీణా యుగం ప్రారంభమైంది. అంతకు ముందు ఒకటి అర వీణ పాటలు ఉన్నా వాణిశ్రీ తోటే వీణ కి ఎక్కువ గుర్తింపు వొచ్హింది. వాణిశ్రీ ఉంటే తప్పకుండా వీణ పాట ఉండాల్సిందే. వాణిశ్రీ వీణ పాటలు చూసి ఎందరో వీణ నేర్చుకోటం మొదలు పెట్టారు. పెళ్ళి చూపుల్లో వీణ వాయించటం ఒక ఫాషన్ అయిపోయింది.

'వీణ లోనా తీగ లోన, ఎక్కడున్నది నాదము, అది ఎలాగైనది రాగము, మాటలోన- మనసులోన, ఎక్కడున్నది భావము, అది ఎప్పుడౌను గానము ' అని 'చక్రవాకమై ' అబ్బుర పడింది.

'మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నొ చెలరేగే, కలనైన కనని ఆనందం , ఇలలోన విరిసె ఈనాడే! ' అని ఎంతో ఆత్మీయంగా, తనకు తెలియకుండా చాటుగా దాగి ఉన్న ప్రియుడికి తన వీణా గానం తోనే మనసు విప్పి చెప్పగలిగింది.

అంతే కాదు- ' ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో, నాలోన మ్రోగేను ఎన్ని భావాలో,' అంటూ అత్తలు-కోడళ్ళు లో పొలం పనులనుంచి వొచ్హిన భర్తని, అతి సున్నితంగా వీణ మీటి సేదతీర్చింది. ఆ వీణా నాదంలోని ప్రేమకి పరవశించి సోలిపోని వారు ఎవరు?

'ఏ రాగమని పాడను, ఏ తీగ నే మీటను- నవరస, కన్నడ, వసంత, వరాళి, మోహన, కల్యాణి, ఆనంద భైరవి ' అంటూ అన్ని రాగాల ప్రేమనుబంధంతో 'జీవన తీరాలు ' దాటగలిగే శక్తి ఈ వీణదే అని చెప్పకనే చెప్పింది.

నిశ్శబ్ధంగా ఉండిపోయిన మనసును- ' మీటి చూడు నీ హ్రుదయాన్ని, మ్రోగుతుంది ఒక రాగం-,అంటు జీవితంలోని 'చీకటి వెలుగులను ' తట్టుకో గలిగే ఉత్సాహాన్ని ఈ వీణ తోటే కలిగిస్తుంది.

ఎంతో ప్రేమని పంచిన తన ప్రేమికుడు, ' దేశోద్ధారకుడు' గా సంఘసేవ లందిచాలని భావించిన ఉన్నతుడు తనకు దూరమైతే - 'ఈ వీణకు శ్రుతి లేదు, ఎందరికో హ్రుదయం లేదు, ఈ పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్ధం కాదు' అని తన నిరాశా నిష్ప్రుహలను కూడా ఈ వీణ లోనే పలికించింది.

' నీ దయరాదా, రామ నీ దయ రాదా,- అని ఎంతో భక్తిగా తన వీణా నాదంతోనే 'పూజ ' లు చేసి దేవుణ్ణి కూడా కరిగించటానికి ప్రయత్నం చేసింది.

'ఎవరో రావాలి, ఈ వీణను కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి,' అని చివరికి ఎంతో ఆర్ధ్రం గా మూల దాగి మూగ బోయిన మధుర వీణని కూడ ఓదార్చి 'రక్తి మరచి-శక్తి విడచి, మాసిపో తగునా!' అని నిలదీసి ఒక 'ప్రేమ నగరాన్ని ' నిర్మించే శక్తి ఒక్క వాణిశ్రీ కే ఉందేమో, అనిపిస్తుంది.

వాణిశ్రీ లో సావిత్రిని చూసుకున్నాము. వాణిశ్రీ ని ఎవరిలో చూసుకోవాలో!

Saturday, September 5, 2009

'అసందర్భ పాటలు '


ఆయా సందర్భాలలో ఈ పాటలు పాడితే ఎలాఉంటుందో!

పుట్టినరోజు పార్టీలొ: వేణువై వొచ్హాను భువనానికి, గాలినై పోతాను గగనానికి

పెళ్ళిరోజు: పావురానికి, పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం--

చావుకి : భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటిరోజు.

గ్రుహ ప్రవేశానికి : దేవుడే ఇచ్హాడు వీధి ఒకటి, సొంత ఇల్లేల, ఉన్నఊరేల ఓ చెల్లెలా!

పిక్నిక్ లో: అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ త్రుప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం.

బ్యూటీ పార్లల్ లో: పాడు జీవితము యవ్వనం , మూడునాళ్ళ ముచ్హట లోయి, అయ్యయ్యో! నీదు పరుగులెచటికోయి.

ప్రేమికుల దగ్గిర: మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే! మనసున్న మనిషికీ సుఖము లేదంతే!

తీర్థ యాత్రలకు వెల్తుంటే: టాటా! వీడుకోలు! గుడ్బై ఇంక శెలవు--

ఓకే! ఇంక నాకు కూడ శెలవు.

మీరు కూడా ఏమైనా జోడిస్తారేమొ చూడండి!
(ఇది కేవలం సరదాకు మాత్రమే)

Sunday, August 2, 2009

స్నేహమా! 'దీర్ఘాయుస్మాన్ భవా'

కూడలి మిత్రులందరికి 'స్నేహబంధం' శుభాకాంక్షలు.
నీకు స్నేహితుల అవసరం లేనప్పుడే మంచి స్నేహితులు వస్తారు అని ఎక్కడో చదివాను. ఇది జీవిత సత్యం. అందుకే నాకు ఇప్పటికీ గుర్తుంది. నీకు నువ్వుగా ఇచ్చుకునే బహుమతే స్నేహితులు.
అనుభవమైతే కాని అర్ధం కాని అద్భుత భావం స్నేహం
స్నేహబంధము ఎంత మధురము
చెరిగి పోదు తరగి పోదు జీవితాంతము
తడికన్నులను తుడిచే నేస్తం
ఒడిదుడుకులలో నిలిచే నేస్తం
ఒక్కరు ఉన్నా చాలు కదూ;
ఒకరికి కస్ఠం కలిగితే మరొకరికి బాధ కలిగేది స్నేహం
ఒకరికి కీర్తి దక్కితే మరొకరికి సంతోషం కలిగేది స్నేహం
ఉచ్వాస, నిష్వాసలే స్నేహానికి ప్రాణం -
వారే ప్రాణ స్నేహితులు.
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

Monday, April 20, 2009

నాలో నేను

అంతు లేని బాధ నాది
ఎందుకీ బాధ
ఊహల్లో బతికే నేను ఎప్పుడు ఇంట్లోనే
ఏమిటి ఈ ఒంటరి తనము
నా భావాలన్నీ చెప్పు కో టానికిఎక్కడికి వెళ్ళాలి
ఎవరికీ చెప్పాలి, ఎలా చెప్పాలి
ఎందుకు పనికి రాని జీవితము అనిపిస్తుంది
తీవ్రమైన అసంతృప్తి
ఎక్కడికైనా పారిపోవాలి
హిమలయలకో, పూల తోటలలోకో వెళ్ళిపోవాలని
మల్లి ఎప్పుడు తిరిగి రావొద్దని
నేనంటే ఈ ప్రకృతికి ఇస్తమైతేబాగుండు
నన్ను ప్రేమగా తనతోటే ఉంచుకుంటే బాగుండు
నోరు తెరిచే అధికారమే లేని నేను
మనస్పూర్తిగా ఎన్నో కబ్ర్లు చెప్పాలి
అల్లా అల్లా ఎటో వెళ్లి పోవాలి
ఎటువంటి భావాలూ లేని లోకము లో ఎప్పటికి ఉండిపోవాలి
ఎవరు లేని నేను
నాకోసమే నాకోసమే ఉండిపోవాలి
నేనున్నాను అని పడే పడే అనుకోవాలి